
బోయ
భారతదేశంలోని జంతు వేటను ప్రధాన వృత్తిగా కలిగియున్న అటవీతెగల్లో బోయ ఒకటి. బోయలను కన్నడబాషలో బేడర అని మలయాళములో“నాయర్”అని పిలుస్తారు.భారతీయ కులవ్యవస్థ విభాగం ప్రకారము సెంట్రల్ లిస్టులో O.B.C లుగా, తమిళ నాడు, కేరళ లలో B.C లుగా, ఆంధ్ర ప్రదేశ్ B.C-A గా,కర్ణాటకలో కేటగిరి 1 గా,అనగా వెనుకబడిన తరగతులుగా గుర్తింపబడుచున్నారు. వీరు అడవులలో నుండి వచ్చిన ట్రైబులు గా ST లుగా 1964 వరకూ భారత రాజ్యాంగములో తెలుప బడినారు.
. . . బోయ . . .
సంస్కృత మహాభారత కావ్యంలో పేర్కొనబడ్డ కిరాతులు తెలుగు అనువాదంలో బోయవారిగా పేర్కొనబడ్డారు. అందుకు కారణం కిరాతుల్లో ఉన్న శక్తి సామర్ధ్యాలు బోయవారిలో కూడా ఉండటమే. తమ ధైర్య సాహసాలతో భూములను ఆక్రమించి అనుభవించే వారు కావున వీరు “భోగికులని” అదే పేరు బోయ అయ్యిందని శ్రీ కంభంపాటి సత్యనారాయణ అభిప్రాయ పడ్డారు . శ్రీ ఆర్.బి.కిత్తూర “వాల్మీకి వంశజరా”అనే కన్నడ ప్రచురణలో దక్షిణ భారతదేశములోని బోయలు, ఉత్తరభారతదేశములోని రాజ కుటుంబాలు అన్నదమ్ములని, దాయాదులని వ్రాశారు. బోయ అన్నది ఆటవిక కాలములో ధైర్య ,సాహసములకు మెచ్చిఇచ్చిన ఒక బిరుదు అని కంభంపాటి సత్యనారాయణ తెలిపారు. బోయలు క్షత్రియులు అని జవహరలాల్ యూనివర్సిటీ చరిత్రపరిశోధకులైన ఆచార్య ఛటోపాధ్యాయ అభిప్రాయపడ్డారు. బోయ అనేపదమును ఒక గౌరవ పదముగా బిరుదుగా ఇవ్వబడినది అని ధైర్యసాహసములు కలిగిన వారికి ఒసంగ బడినది అని (ఆంధ్రులచరిత్ర -సంస్కృతి) తెలపబడినది.
బోయవారిని “వారియర్స్ అండ్ రూలర్స్” అని ఆంగ్లేయులు (castes and tribes of southern India) అభివర్ణించారు. “రాయ వాచకము” ప్రకారం శత్రువులను తుదముట్టించడానికి విజయనగర సామ్రాజ్యపు రాజైన కృష్ణదేవరాయలు తన మంత్రి అయిన అప్పాజీతో కలిసి విలువిద్యలో సాటిలేని బోయ దొరలను, ఇతర 11 సంస్థానాల సహాయం తీసుకొన్నాడు.అనతి కాలంలోనే బోయ దొరలు కర్నాటకలోరాయదుర్గం, ఆంధ్రదేశంలో కళ్యాణదుర్గం కోటలకు అధిపతులై విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా చేశారు. 10 – 18 శతాబ్దాల మధ్య కర్నాటకలో చిత్రదుర్గ కోట నిర్మాణంలో రాష్ట్రకుటులు, హోయసాలు, చాళుక్యులతోపాటూ బోయ పాలెగార్లు కూడా పాలుపంచుకొన్నారు. తూర్పు చాళుక్య, విష్ణుకుండిన, కాకతీయ సైన్యాల్లో బోయ తెగలవారు సైనికులుగా కీలక పాత్ర పోషించారు.
. . . బోయ . . .